పాకిస్తాన్‌: 15 వేల రూపాయల గ్యాస్ సిలిండర్‌‌కు 24 వేల రూపాయలు ఎందుకు చెల్లించాల్సి వస్తోంది?

పాకిస్తాన్, ఎల్పీజీ గ్యాస్ ధరలు, చమురు
ఫొటో క్యాప్షన్, బహిరంగ మార్కెట్లో ఎల్పీజీని అధికారిక ధర కంటే చాలా ఎక్కువకు విక్రయిస్తున్నారనే విషయాన్ని పాకిస్తాన్ ఇంధన శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ అంగీకరించారు.
    • రచయిత, ఉమర్ దరాజ్ నంగియానా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

పాకిస్తాన్‌లో గృహ వినియోగానికి ఉద్దేశించిన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) అధికారిక ధరకు, మార్కెట్లో వినియోగదారులు చెల్లిస్తున్న ధరకు భారీ వ్యత్యాసం ఉంది. చాలామంది వినియోగదారులు గ్యాస్ కొనుగోలు కోసం రెండింతల ధరలు చెల్లిస్తున్నారు.

ఇలా అధిక ధర చెల్లిస్తున్న వారిలో ఇస్లామాబాద్‌కు చెందిన మహమ్మద్ సఘీర్ ఒకరు.

ఎల్పీజీ ధర కిలోకు సుమారు 295 పాకిస్తానీ రూపాయలే ఉండాలని పాకిస్తాన్‌లో చమురు, గ్యాస్ నియంత్రణ సంస్థ ఓజీఆర్ఏ చెబుతోంది.

అయితే, మహమ్మద్ సఘీర్ ఇటీవల 12 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ 6,500 రూపాయలకు కొనుగోలు చేశారు.

అంటే ఆయన కిలో ఎల్పీజీకి 550 రూపాయలకుపైగా చెల్లించారు. ఇది ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే దాదాపు రెండింతలు ఎక్కువ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎల్పీజీ ఎక్కడ దొరుకుతుందో, అసలు ఆ ధరకు గ్యాస్ లభిస్తుందో లేదో కూడా మహమ్మద్ సఘీర్‌కు తెలియదు.

అయితే, గత కొన్నివారాలుగా గ్యాస్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో తన కుటుంబం ఖర్చులపై తీవ్ర ప్రభావం పడుతోందన్న విషయం మాత్రం ఆయనకు బాగా తెలుసు. పెరుగుతున్న ఎల్పీజీ ధరలు ఇంటి బడ్జెట్‌ను మరింత భారంగా మారుస్తున్నాయని మహమ్మద్ సఘీర్ అంటున్నారు.

పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, పెరుగుతున్న ఖర్చులను భరించలేక తన పిల్లలను పాఠశాలకు పంపించలేని పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"గత కొన్ని నెలలుగా ప్రతి పది రోజులకు ఒకసారి సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక సిలిండర్ గ్యాస్‌తో ఎలాగోలా వంట చేసుకుంటున్నాం. కానీ, మరో సిలిండర్ కొనుగోలు చేసి ఆ ఖర్చును భరించడం మా వల్ల కావడం లేదు" అని మహమ్మద్ సఘీర్ చెప్పారు.

పాకిస్తాన్, ఎల్పీజీ గ్యాస్ ధరలు, చమురు
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని అనేక ప్రైవేట్ హౌసింగ్ సొసైటీల్లో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ లేదు.

మహమ్మద్ సఘీర్ నెలవారీ ఆదాయంలో గణనీయమైన భాగం ఎల్పీజీ సిలిండర్ల కొనుగోలుకే ఖర్చవుతోంది. మహమ్మద్ సఘీర్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తండ్రి పోషణ బాధ్యతలను మోస్తున్నారు. భార్యాభర్త ఇద్దరూ పనిచేస్తూ, కుటుంబ అవసరాలను తీర్చేందుకు శ్రమిస్తున్నారు.

ఇస్లామాబాద్‌లోని ఒక ప్రైవేట్ హౌసింగ్ సొసైటీలోని భవనం పైకప్పుపై నిర్మించిన ఒక చిన్న గదిలో ఈ కుటుంబం నివసిస్తోంది. వారికి పైప్డ్‌ గ్యాస్ కనెక్షన్ లేదు.

వాళ్లు ఉండే గదికి కనీసం తలుపు కూడా లేదు. చలికాలంలో దానిని వెచ్చగా ఉంచడం అసాధ్యంగా మారుతోంది.

పాకిస్తాన్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అనేక కుటుంబాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

పాకిస్తాన్‌లోని అనేక ప్రైవేట్ హౌసింగ్ సొసైటీల్లో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ లేదు. కొన్ని ప్రాంతాల్లో కనెక్షన్ ఉన్నప్పటికీ, గ్యాస్ సరఫరా సరిగా అవ్వడం లేదు.

దీంతో గృహ వినియోగదారులు పూర్తిగా ఎల్పీజీ సిలిండర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ నియంత్రణ సంస్థ ఓజీఆర్‌ఏ నిర్ణయించిన అధికారిక ధరకు ఎల్పీజీ ఎందుకు లభించడం లేదో మహమ్మద్ సఘీర్‌కు అర్థం కావడం లేదు. అయితే ఇటీవల దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది.

పాకిస్తాన్, ఎల్పీజీ గ్యాస్ ధరలు, చమురు
ఫొటో క్యాప్షన్, చలికాలం ప్రారంభానికి ముందే ఇరాన్ సరిహద్దు మూసివేయడంతో ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.

ఎల్పీజీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

పాకిస్తాన్ ఇంధన శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఇటీవల నిర్వహించిన ఒక విలేఖరుల సమావేశంలో, ఎల్పీజీని అధికారికంగా నిర్ణయించిన ధర కంటే చాలా ఎక్కువకు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్న విషయాన్ని అంగీకరించారు.

అమెరికా - ఇరాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులు మూసివేయడంతో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలు ఎల్పీజీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని అలీ పర్వేజ్ మాలిక్ చెప్పారు.

అయితే, చలికాలం ప్రారంభానికి ముందే ఇరాన్ సరిహద్దు మూసివేయడంతో ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు.

"ఈ పరిస్థితిని లాభాపేక్ష గల వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని, ఎల్పీజీని కిలోసుమారు 700 రూపాయల వరకు విక్రయించడం ప్రారంభించారు" అని ఆయన పేర్కొన్నారు.

ధరలు పెరగడానికి ఇది ఒక్కటే కారణం కాదన్నారు అలీ పర్వేజ్ మాలిక్. ఎల్పీజీ దిగుమతి వ్యవస్థలో ఉన్న లోపాలు, గ్యాస్ నిల్వ సదుపాయాల కొరత కూడా ఈ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నాయని వివరించారు.

పాకిస్తాన్ ఇప్పటికీ ప్రత్యేక కంటైనర్ల ద్వారానే ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. చిన్న కంటైనర్లు అందుబాటులో లేవు. మరోవైపు, పెద్ద ఎల్పీజీ నౌకలు నిలిపేందుకు అవసరమైన సదుపాయాలు కూడా పాకిస్తాన్ నౌకాశ్రయాల్లో లేవని ఆయన అన్నారు.

"ఒకవేళ పెద్ద గ్యాస్ నౌకలు వచ్చినా, ఆ గ్యాస్‌ను ఎక్కడ నిల్వ చేస్తాం? దానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు. గత ప్రభుత్వ హయాంలో ఈ అంశంపై ఎలాంటి ఆలోచన చేయలేదు" అని అలీ పర్వేజ్ మాలిక్ విమర్శించారు.

ఎల్పీజీ దిగుమతి, విక్రయాల్లో అమలులో ఉన్న కోటా వ్యవస్థ ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం అని ఆయన అన్నారు. దీనివల్ల కొందరు వ్యక్తులు మాత్రమే లాభపడుతున్నారని ఆరోపించారు.

కొత్త ఎల్పీజీ విధానం కింద, గుత్తాధిపత్యానికి ముగింపు పలికి, పోటీకి అవకాశం కల్పించే వ్యవస్థను ప్రభుత్వం తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

పాకిస్తాన్‌లో రోజువారీ ఎల్పీజీ డిమాండ్ 6,500 నుంచి 7,000 టన్నుల వరకు ఉంటుందని అలీ పర్వేజ్ మాలిక్ తెలిపారు. అయితే దేశీయ ఉత్పత్తి కేవలం 2,000 నుంచి 2,500 టన్నుల మధ్యే ఉందని, దీంతో మిగతా అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.

పాకిస్తాన్, ఎల్పీజీ గ్యాస్ ధరలు, చమురు
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో రోజువారీ ఎల్పీజీ డిమాండ్ 6,500 నుంచి 7,000 టన్నుల వరకు ఉంటుంది

వ్యాపారాలకు దెబ్బ

ఎల్పీజీ ధరల పెరుగుదలతో రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర ఆహార వ్యాపారాల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి.

పెద్ద రెస్టారెంట్లలో ఎల్పీజీ వినియోగం అధికంగా ఉంటుంది. వాటి అవసరాల కోసం పెద్ద సంఖ్యలో సిలిండర్లు ఉపయోగించాల్సి వస్తోంది.

"45 కిలోల ఎల్పీజీ సిలిండర్లను ఉపయోగిస్తాం. నెల రోజుల క్రితం ఒక సిలిండర్ ధర రూ.14,000 - రూ.15,000 మధ్య ఉండేది. ఇప్పుడు అది రూ.24,000 - రూ.25,000కు చేరుకుంది" అని ఇస్లామాబాద్‌లోని ఒక రెస్టారెంట్ మేనేజర్ ఖిజర్ షా బీబీసీకి చెప్పారు.

"ధరల పెరుగుదలతో ఖర్చులు అనేక రెట్లు పెరిగాయి. చలికాలంలో వ్యాపారం మందగిస్తుంది. గ్యాస్ అందుబాటులో లేకపోయినా, ధరలు మరింత పెరిగినా వ్యాపారం పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి వస్తుంది" అన్నారు.

బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాకు చెందిన హోటల్ యజమాని నవీద్ అహ్మద్ కూడా గ్యాస్ కోతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా తన మూడు హోటళ్లలో రెండింటిని మూసివేయాల్సి వచ్చిందని చెప్పారు.

"ప్రస్తుతం ఒక హోటల్ మాత్రమే నడుపుతున్నాం. రోజుకు కేవలం ఐదు గంటలే గ్యాస్ వస్తోంది. మరోవైపు, ఎల్పీజీ ధర కిలోకు రూ.600కి చేరుకుంది" అని ఆయన తెలిపారు.

పెషావర్‌కు చెందిన తందూర్ యజమాని జియౌర్ రెహ్మాన్ మాట్లాడుతూ, పిండి, గ్యాస్ ధరలు రెండూ పెరగడంతో తన ఆదాయం దాదాపు ఆగిపోయిందన్నారు.

"ఒక సంచి పిండి ధర రూ.14,000. గ్యాస్ ధర కిలోకు రూ.600 అయింది. చిన్న రొట్టెను రూ.20కి, పెద్ద రొట్టెను రూ.30కి విక్రయిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో లాభమనే మాట దాదాపు లేకుండాపోయింది" అని ఆయన వాపోయారు.

గత పది రోజులుగా తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోయానని పెషావర్‌లోని ఒక స్థానిక హోటల్ యజమాని లైల్ షా చెప్పారు.

"పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్‌ను మూసివేయాల్సి వస్తుంది" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ధరలను అదుపు చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఏంచేస్తోంది?

ఎల్పీజీ ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర చాలా పరిమితంగా ఉంటుందని పాకిస్తాన్ ఇంధన మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్పీజీ ప్రాథమిక ధర సౌదీ అరామ్‌కో కాంట్రాక్ట్ ధరతో అనుసంధానమై ఉండగా, పాకిస్తాన్‌లో ఓజీఆర్‌ఏ ప్రతి నెలా ధరల ప్రకటన విడుదల చేస్తుందని తెలిపారు.

చలికాలంలో ఇంధన అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

"పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాను కొనసాగించేందుకు అవసరమైతే ఖరీదైన ఇంధనాన్ని కూడా కొనుగోలు చేస్తాం. అలాగే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల డిమాండ్‌ను ఎల్‌ఎన్‌జీ ద్వారా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం" అని పర్వేజ్ మాలిక్ చెప్పారు.

ప్రధానమంత్రి ఆదేశాల మేరకు, గృహ వినియోగదారులకు రోజుకు కనీసం మూడు సార్లు వంట చేసుకోవడానికి అవసరమైన గ్యాస్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని కూడా ఆయన పేర్కొన్నారు.

అయితే, పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్ లేని వినియోగదారులకు ఎల్పీజీయే ప్రధాన ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఉందని పర్వేజ్ మాలిక్ తెలిపారు. అందువల్ల ఎల్పీజీ ధరల పెరుగుదల ప్రభావం అత్యధికంగా ఈ వర్గాలపైనే పడుతోందన్నారు.

పాకిస్తాన్, ఎల్పీజీ గ్యాస్ ధరలు, చమురు
ఫొటో క్యాప్షన్, దేశీయ, దిగుమతి ఎల్పీజీ ధరల మధ్య వచ్చే తేడాను ఒక ప్రత్యేక నిధిలో జమ చేస్తారు.

పోటీ వ్యవస్థ ఎలా ఉంటుంది?

పాకిస్తాన్‌లో ఎల్పీజీ రంగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇంధన మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ తెలిపారు.

"అత్యంత తక్కువ ధరకు ఇంధనాన్ని దిగుమతి చేసుకుని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో అందించేందుకు పోటీ విధానాన్ని ప్రవేశపెడుతున్నాం" అని ఆయన చెప్పారు.

గ్యాస్ సరఫరాను మెరుగుపరచడం, ధరలను నియంత్రించడం కోసం నాలుగు ప్రభుత్వ సంస్థలకు మళ్లీ ఎల్పీజీ దిగుమతులు చేపట్టాలని ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.

ఆ సంస్థలు:

  • పాకిస్తాన్ స్టేట్ ఆయిల్
  • పార్కో ఎల్పీజీ
  • పాకిస్తాన్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్
  • సూయ్ సదరన్ గ్యాస్ ఎల్పీజీ

ఇప్పటికే ఈ సంస్థలకు ఎల్పీజీ దిగుమతుల కోసం ప్రతిపాదనలు కూడా వచ్చాయని ఆయన తెలిపారు. దిగుమతి చేసుకున్న ఎల్పీజీని సరఫరా వ్యవస్థలో చేరిస్తే, దాని ధర కిలోకు సుమారు 450 రూపాయల వరకు ఉండవచ్చని చెప్పారు.

ప్రైవేట్ దిగుమతిదారులకు కూడా తక్కువ ధరలకు ఎల్పీజీ ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. దీంతో మార్కెట్‌లో పోటీ పెరిగి, ధరలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు.

కొత్త ఎల్పీజీ విధానం ప్రకారం:

  • దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఎల్పీజీని వేలం ద్వారా విక్రయిస్తారు.
  • ప్రస్తుతం ఉన్న కోటా వ్యవస్థను రద్దు చేస్తారు.
  • దేశీయ లేదా దిగుమతి ఎల్పీజీ ధరలను ఓజీఆర్‌ఏ నిర్ణయించదు.
  • దేశీయ ఉత్పత్తి ధర వేలం ద్వారా నిర్ణయిస్తారు.

దేశీయ, దిగుమతి ఎల్పీజీ ధరల మధ్య వచ్చే తేడాను ఒక ప్రత్యేక నిధిలో జమ చేస్తారు.

ఇంధన మంత్రి ప్రకారం, ఈ నిధిని బెనజీర్ ఇన్‌కమ్ సపోర్ట్ ప్రోగ్రామ్ కింద అర్హులైన పేద కుటుంబాలకు సబ్సిడీ ధరలకు ఎల్పీజీ అందించడానికి ఉపయోగిస్తారు.

కొత్త విధానం ధరలను తగ్గిస్తుందా?

కొత్త విధానం వల్ల తక్షణమే ధరలు తగ్గే అవకాశాలు పరిమితంగానే ఉన్నాయని ఎల్పీజీ రంగానికి చెందిన పలువురు నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అంతేకాక, కొన్ని సందర్భాల్లో ఇది ధరలను మరింత పెంచే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

"వినియోగదారులకు గ్యాస్ మరింత ఖరీదయ్యే ఏ విధానాన్నీ సమర్థించం" అని పాకిస్తాన్ ఎల్పీజీ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ ఖోఖర్ అన్నారు.

ప్రభుత్వ కొత్త విధానం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్న వేళ దేశీయంగా కూడా గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన బీబీసీకి చెప్పారు.

ప్రభుత్వం ఎల్పీజీ దిగుమతులపై విధిస్తున్న పన్నులు, టెర్మినల్ చార్జీలను తగ్గించినా లేదా పూర్తిగా ఎత్తివేసినా, ధరలు వెంటనే తగ్గే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం ఎల్పీజీపై కిలోకు సుమారు 100 పాకిస్తానీ రూపాయల పన్నుతో పాటు ఇతర ప్రభుత్వ పన్నులు కూడా వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

లాభాపేక్షతో ప్రజలను దోచుకుంటున్న వారిపై న్యాయపరమైన విచారణ జరిపి, వినియోగదారులకు న్యాయమైన ధరలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

దిగుమతిదారులు విదేశాల నుంచి అధిక ధరలకు ఎల్పీజీ కొనుగోలు చేస్తున్నప్పటికీ, వివిధ పన్నులు, అదనపు ఖర్చుల కారణంగా ఓజీఆర్‌ఏ నిర్ణయించిన ధరలకు విక్రయించడం సాధ్యం కావడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

"దేశీయంగా నిర్ణయించిన తక్కువ ధరకు లభించిన గ్యాస్‌ను దిగుమతి గ్యాస్ ధరలకు విక్రయిస్తూ స్థానిక మాఫియా బిలియన్ల రూపాయలు సంపాదించింది" అని ఇర్ఫాన్ ఖోఖర్ ఆరోపించారు.

ఈ మొత్తం వ్యవహారంపై నిష్పాక్షికంగా విచారణ జరిపితే, అధిక లాభాల కోసం వినియోగదారులను దోచుకుంటున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)