మత నియమాల కారణంగా రక్త మార్పిడి వద్దనుకున్న యువకుడు మృతి, ఆయన మరణం తర్వాత ఆ రూల్స్ మార్చిన మత పెద్దలపై విమర్శలు

ఫొటో సోర్స్, Valdez Family
- రచయిత, అలీమ్ మఖ్బూల్, కేథరిన్ వియట్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
2026 ఆగస్టులో 26 ఏళ్ల ఐజాక్ వాల్డెజ్ స్థానిక లైబ్రరీలో పుస్తకాలు చూస్తుండగా ఒక్కసారిగా మూర్చ వచ్చి కింద పడిపోయారు.
తల నేలకు బలంగా తగలడంతో ఆయన స్పృహ కోల్పోయారు.
ఐజాక్ తలకు తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల మెదడులో రక్తస్రావం అయిందని ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు చెప్పారు.
అయితే ఐజాక్ 'యెహోవాస్ విట్నెస్' విశ్వాసాలను అనుసరించే వ్యక్తి. క్రైస్తవ మతంలో ఇదొక విభాగం. ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైనా సరే వీరు వేరొకరి రక్తాన్ని ఎక్కించుకోరు.
అందుకే ఐజాక్ ఎప్పుడూ తనతో ‘నో బ్లడ్’ (రక్తం వద్దు) అనే కార్డును ఉంచుకునేవారు.

ఆ కార్డు ప్రకారం, తన మత విశ్వాసాల ప్రకారం ఎటువంటి రక్త మార్పిడి చికిత్సను తీసుకోనని చెప్పేవారు. దీంతో వైద్యులు చికిత్స అందించేటప్పుడు ఆయన మతపరమైన అభీష్టాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది.
ఈ విశ్వాసం కారణంగా ఆయనకున్న బ్రెయిన్ హేమరేజ్‌కు చికిత్స సంక్లిష్టంగా మారింది.
ఐజాక్ రక్త మార్పిడికి నిరాకరించడంతో మెదడు నుంచి ద్రవాన్ని బయటకు తీసే కీలకమైన శస్త్రచికిత్సను వైద్యులు చేయలేకపోయారు.
అయితే ఆయన తిరిగి స్పృహలోకి వచ్చి మాట్లాడటంతో వాక్సాహాచీ (టెక్సాస్)లోని ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రాణం పోయాక..
అంతేకాక, తాను "రక్త మార్పిడి వద్దు" అనే నమ్మకానికే కట్టుబడి ఉన్నానని ఐజాక్ స్వయంగా స్పష్టం చేశారు.
అయితే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందన్న కుటుంబ సభ్యుల ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. ఐజాక్ మళ్లీ కోమాలోకి వెళ్లిపోయారు. పరిస్థితి వేగంగా క్షీణించింది.
ఐజాక్ ప్రాణాలను కాపాడటానికి తక్షణం ఆపరేషన్ చేయడం ఒక్కటే మార్గమని అయితే దానికి కచ్చితంగా రక్త మార్పిడి అవసరమని ఆయన కుటుంబానికి న్యూరోసర్జన్ తేల్చి చెప్పారు.
జీవితాంతం 'యెహోవాస్ విట్నెస్' విశ్వాసాలను అనుసరించిన ఐజాక్ కోరికను గౌరవిస్తూ రక్త మార్పిడి చికిత్సను నిరాకరించాలని కుటుంబం నిర్ణయించుకుంది.
ఐజాక్ చాలా తెలివైనవాడని, వలంటీర్‌గా సేవ చేయడం, వృద్ధులకు సాయం చేయడం ఎంతో ఇష్టమని ఆయన కవల సోదరుడు జాకబ్ వాల్డెజ్ వివరించారు.
చివరకు వైద్యులు లైఫ్ సపోర్ట్‌ను నిలిపివేయడంతో 2026 ఆగస్టు 26న ఐజాక్ మరణించారు.
ఐజాక్ చనిపోయిన 23 రోజుల తర్వాత 'యెహోవాస్ విట్నెస్' గవర్నింగ్ బాడీ (పాలక మండలి) తమ బోధనల్లో ఒక చారిత్రాత్మక మార్పును ప్రకటించింది.
ఈ కొత్త నియమం ముందే వచ్చి ఉంటే ఐజాక్ చికిత్సను పొందేందుకు మత విశ్వాసం అనుమతించి ఉండేది.
ఇప్పుడు తీసుకొచ్చిన మార్పు వల్ల రక్త మార్పిడి చికిత్సపై ఉన్న నిషేధం తొలగిపోయింది.
ఇటువంటి చికిత్సలను అంగీకరించాలా వద్దా అనే నిర్ణయాన్ని పూర్తిగా ఆయా వ్యక్తుల ఇష్టానికే వదిలేస్తూ 'యెహోవాస్ విట్నెస్' గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాన్ని ముందే ఎందుకు తీసుకోలేదని 'యెహోవాస్ విట్నెస్' గవర్నింగ్ బాడీపై ఐజాక్ సోదరుడు జాకబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ మార్పు ముందే వచ్చి ఉంటే తన సోదరుడు బతికే ఉండేవాడని బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Valdez Family
81 ఏళ్ల కిందటి నిబంధన
రక్త మార్పిడిపై ఉన్న ఈ పాత నిబంధన 1945 నాటిది.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి వైద్యంలో రక్త మార్పిడి వాడకం బాగా పెరిగింది.
ఆ సమయంలో 'యెహోవాస్ విట్నెస్' నాయకులు తమ అనుచరులు రక్త మార్పిడిని అంగీకరించకూడదని ప్రకటించారు.
బైబిల్లోని పాత, కొత్త నిబంధనల్లో రక్తాన్ని తీసుకోకూడదని చెప్పే వచనాల ఆధారంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
బైబిల్లోని కొత్త నిబంధనలో ఉన్న ఐదో పుస్తకం 'బుక్ ఆఫ్ యాక్ట్స్'లో ఒక వచనం రక్తం, విగ్రహాలకు అర్పించిన పదార్థాలు, గొంతు పిసికి చంపిన జంతువుల మాంసానికి దూరంగా ఉండాలని విశ్వాసులను ఆదేశిస్తుంది.
మరి న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే 'యెహోవాస్ విట్నెస్' గవర్నింగ్ బాడీ తాము 81 ఏళ్ల కిందట ప్రవేశపెట్టిన ఈ నియమాలను ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది?
మతంలోని సభ్యుల నుంచీ, బయటి వర్గాల నుంచీ కొన్నేళ్లుగా వస్తున్న ఒత్తిళ్లే దీనికి కారణం.
అయితే సంస్థ నాయకులు మాత్రం తమ నిర్ణయానికి మరో కారణాన్ని చెబుతున్నారు.
"ఈ మార్పు ప్రాథమికంగా ఆధునిక వైద్యానికి, దాని పద్ధతులకు బైబిల్ సూత్రాలను అన్వయించడమే" అని 'యెహోవాస్ విట్నెస్' అంతర్జాతీయ ప్రతినిధి పాల్ గిలీస్ చెప్పారు. ఇది బైబిల్ రచనలు, వైద్య రంగంలోని పురోగతిని కొత్త కోణంలో పరిశీలించి తీసుకున్న నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

'ఇప్పటికీ నిషేధం ఉంది'
ఎసెక్స్ గ్రామీణ ప్రాంతంలోని 85 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 'యెహోవాస్ విట్నెస్' యూకే ప్రధాన కార్యాలయంలో గిలీస్ను బీబీసీ ప్రతినిధి కలిశారు.
అది పెద్ద ఆధునిక కాంప్లెక్స్. వందల మంది అక్కడే నివసిస్తూ, జీతం తీసుకోకుండా పని చేస్తుంటారు.
రక్తానికి సంబంధించిన ప్రాథమిక బోధనలో ఏమాత్రం మార్పులేదని గిలీస్ చెబుతున్నారు. శరీరంలో 'మొత్తం రక్త మార్పిడి' చేయడం ఇప్పటికీ నిషేధమేనని స్పష్టం చేశారు.
అయితే గత కొన్ని దశాబ్దాలుగా వైద్యంలో పూర్తి రక్తాన్ని కాకుండా రోగికి అవసరమైన నిర్దిష్ట రక్తాన్ని మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ వంటి రక్త భాగాలను ఉపయోగించే వైద్య విధానాలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఈ కొత్త మార్పును వారు సమర్థించుకుంటున్నారు. గతంలో వీటన్నింటినీ నిషేధించారు.
బైబిల్ "రక్తాన్ని విసర్జించడం" గురించి ప్రస్తావించింది కానీ, "రక్తం నుంచి వేరు చేసిన వివిధ భాగాల" గురించి కాదని గిలీస్ వాదించారు.
బైబిల్లో పేర్కొన్న దానికంటే ఎక్కువ నియమాలు విధించడం సరైంది కాదని గవర్నింగ్ బాడీ భావించిందని, ప్రత్యేకంగా చెప్పిన దాన్నే ఆచరించిందని ఆయన అన్నారు.
అయితే ఈ వివరణతో అనేక మంది ఆశ్చర్యపోయారు. బైబిల్లో రక్త మార్పిడి గురించి ప్రత్యేకంగా ఎక్కడా చెప్పనప్పుడు 81 ఏళ్ల క్రితమే రక్త మార్పిడిని పూర్తిగా నిషేధించడం పెద్ద తప్పు కాదా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
కొన్ని దశాబ్దాలుగా పూర్తి రక్తాన్ని కాకుండా కేవలం రక్తంలోని నిర్దిష్ట భాగాలను ఉపయోగించడమే సాధారణ పద్ధతిగా మారినప్పుడు, ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇంత కాలం ఎందుకు పట్టిందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
'క్షమాపణ చెప్పండి'
ఐజాక్ సంస్మరణ సభ ముగిసిన కొద్ది రోజులకే ఈ నిషేధం తొలగిపోవడంతో జాకబ్ మనసులో ఇవే ప్రశ్నలు మెదిలాయి.
దీంతో తాను పెరిగిన 'యెహోవాస్ విట్నెస్' మతాన్ని జాకబ్ వదిలిపెట్టారు. ఐజాక్ మరణం తర్వాత టెక్సస్‌లోని సంఘ ప్రముఖులకు ఆవేదన, బాధతో కూడిన కొన్ని సందేశాలు పంపించారు.
"అసలు దేవుని సంకల్పమే కాని ఒక విషయం కోసం ఇంత మంది తమ ప్రాణాలను త్యాగం చేసేలా ప్రోత్సహించడంలో మీ పాత్ర ఏంటో ఆలోచించుకోండి" అని వారిని ప్రశ్నించారు.
చాలా మంది దీనికి సమాధానం ఇవ్వలేదు.
కానీ ఒక పెద్ద స్పందిస్తూ ఈ విధాన మార్పు గురించి జాకబ్ ఎందుకు అంత కోపంగా పట్టుదలగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.
ఇది జాకబ్‌కు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.
ఈ విధానం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మత నాయకత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
"వాళ్లు క్షమాపణ చెప్పాలని అడగాలనుకుంటున్నాను. మాట దాటవేయకుండా, సూటిగా క్షమాపణ చెప్పాలి" అని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది ఉన్న 'యెహోవాస్ విట్నెస్' వర్గంలో రక్త మార్పిడిని నిరాకరిస్తూ ఏటా ఎంతమంది చనిపోతున్నారనే దానిపై కచ్చితమైన లెక్కలు లేవు.
2016లో 'ది అబ్స్టెట్రికల్ అండ్ గైనకాలజికల్ సర్వే' అనే మెడికల్ జర్నల్‌లో వచ్చిన ఒక స్టడీ ప్రకారం ఈ సంఖ్య ఏటా సుమారు 11 వందలు.
"వారి భావాలను అర్థం చేసుకోగలం. కుటుంబ సభ్యులను కోల్పోయి, ఈ ప్రశ్నల గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తుల మాటలను సానుభూతితో వినాల్సిన అవసరం ఉంది" అని గిలీస్ చెప్పారు.
కానీ ఈ మార్పు ఇంతకు ముందే ఎందుకు రాలేదనే దానికి సరైన స్పష్టత లేదు.
"ఇంత సమయం ఎందుకు పట్టింది? ఎందుకంటే దేనికైనా సమయం పడుతుంది, అంతేకాని ఇక్కడ ఏదో మాయ జరిగిందని కాదు" అని గిలీస్ అన్నారు.
నాయకత్వం క్షమాపణ చెప్పాలనే డిమాండ్లపై గిలీస్ స్పందిస్తూ ఈ నిబంధన వల్ల ఎంతో మంది 'యెహోవాస్ విట్నెస్' రక్తం కలుషితమయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకున్నారని ఆయన సమర్ధించుకున్నారు.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
విశ్వాసాలకు కట్టుబడి..
కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ కొంతమంది యెహోవా విట్నెస్ సంఘం సభ్యులు ఇప్పటికీ రక్త మార్పిడిని వద్దనుకునే హక్కును ఉపయోగించుకుంటున్నారనీ, కొన్నేళ్ల కిందట ఈ మార్పు వచ్చి ఉన్నా కూడా కొందరు ఇదే నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ఆయన వాదించారు.
నిజానికి, పశ్చిమ ససెక్స్‌కు చెందిన 58 ఏళ్ల 'యెహోవాస్ విట్నెస్' సభ్యుడు అలెక్స్ బాల్‌తో బీబీసీ మాట్లాడింది.
2012లో ఆయనకు బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు అవసరమైన కీమోథెరపీ చేసే సమయంలో రక్త మార్పిడి చేయకపోతే బతకడం కష్టమని వైద్యులు చెప్పారు.
"నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు విశ్వాసాలకు కట్టుబడి ఉండాలని అనుకున్నాను. అలాగే చేశాను" అని ఆయన చెప్పారు.
"యెహోవాస్ విట్నెస్ హాస్పిటల్ లైజన్ కమిటీ" సాయంతో అలెక్స్ వేరొకరి రక్తం అవసరం లేకుండా సొంత రక్త కణాలను పెంచే చికిత్సను చేయగల ఒక అమెరికన్ కన్సల్టెంట్‌ను గుర్తించారు.
యూకే కన్సల్టెంట్ కూడా ఈ కొత్త పద్ధతిలో చికిత్స చేయడానికి అంగీకరించారు. అది విజయవంతమైంది.
పదేళ్ల తర్వాత ఇప్పుడు రక్త విధానం మారి చికిత్సకు అనుమతి లభించినప్పటికీ, అలాంటి పరిస్థితి వస్తే పాత నిర్ణయానికే కట్టుబడి ఉంటానని అలెక్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Cummings family
విశ్వాసాల వ్యతిరేకుల బహిష్కరణ
ఇక్కడ కేవలం రక్తాన్ని తీసుకోవడమే కాదు. ఇవ్వడం కూడా సమస్యే.
ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన 50 ఏళ్ల 'యెహోవాస్ విట్నెస్' కు చెందిన ఎలీషా కమింగ్స్ ఈ నియమాల కారణంగా మరణశయ్యపై ఉన్న తన అత్తకు రక్తాన్ని దానం చేయలేకపోయారు. ఆ తర్వాత ఆమె అత్త చనిపోయారు.
ఈ నియమాలు ఎలీషా వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీశాయి. ఆమె భర్త చిన్నతనంలో రక్త మార్పిడి చేయించుకున్నారనే విషయం 'యెహోవాస్ విట్నెస్' సంఘంలో చర్చకు రావడంతో 10 ఏళ్ల వివాహ బంధం తర్వాత ఆయన ఈ మతాన్ని విడిచిపెట్టి ఆమెకు విడాకులు ఇచ్చారు.
"ఈ బ్లడ్ పాలసీ మారినప్పటి నుంచి నేను ప్రశాంతంగా లేను. ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయా" అని ఆమె అన్నారు.
"ఈ సిద్ధాంతం గురించి ప్రజలను ఒప్పించడానికి నేను ఎన్ని ఇళ్లకు తిరిగా? కానీ ఇప్పుడు చూస్తే మీరు అంతా పూర్తిగా మార్చేశారు" అని ఎలీషా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మార్పు వల్ల నమ్మకాలే పోయే పరిస్థితి వచ్చిందని ఎలీషా చెప్పారు. అయినా మతాన్ని వదిలిపెట్టడానికి ఆమెకు మనసొప్పడం లేదు.
ఈ మతమే తనకు అండగా నిలిచిందనీ, దీన్ని వదిలేస్తే ఒంటరినైపోతాననే భయం ఆమెను వెంటాడుతోంది.
గతంలో ఈ "బ్లడ్ పాలసీ" వ్యతిరేకించిన వారిని సమాజం బహిష్కరించేది. లేదా వారే మతాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చేది.
మరి ఇప్పుడు అలాంటి వారు తిరిగి రావడానికి అవకాశం ఉందా? అనే అంశంపై గిలీస్ మాట్లాడారు.
"మళ్లీ ఈ మతంలోకి తిరిగి రావాలనుకునే ప్రతి ఒక్కరికీ సాదరంగా స్వాగతం పలుకుతాం, వారు పెద్దలను కలిసి మాట్లాడుకోవచ్చు" అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























