'నువ్వు ఏడుస్తావా అని అడిగారు': జాబ్ ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కొన్ని షాకింగ్ అనుభవాలు ఎలా ఉంటాయంటే..

ఫొటో సోర్స్, Photothek via Getty Images
- రచయిత, మిచెల్ లబైక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
రిటైల్ స్టోర్‌లో ఉద్యోగం కోసం టియారా అలెన్ సరైన సమయానికే ఇంటర్వ్యూకి హాజరయ్యారు. కానీ ఆమెను ఇంటర్వ్యూ చేయాల్సిన వ్యక్తి మాత్రం రాలేదు.
ఒక షాపింగ్ సెంటర్‌లో ఆమె దాదాపు 40 నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చింది.
ఈలోపు అక్కడ ఉన్న తోటి ఉద్యోగి సదరు ఇంటర్వ్యూయర్‌కు రెండు మూడు సార్లు ఫోన్ చేశారు. చివరకు ఆయన అక్కడకు చేరుకున్న తర్వాత ఆ మీటింగ్ తన షెడ్యూల్‌లో లేకపోవడం వల్లే ఆలస్యమైందని టియారాకు చెప్పారు.
ఆ సమయంలో ఆమెకు ఉద్యోగం చాలా అవసరం కావడంతో ఆఫర్ రాగానే ఉద్యోగంలో చేరారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే తన వ్యవహార శైలి వేరేలా ఉంటుందని ఆమె చెప్పారు.
"ఇంటర్వ్యూ కోసమే అంత సమయం తీసుకునే కంపెనీలో నేను అస్సలు ఉద్యోగం చేయను" అని ఆమె అన్నారు.

ఇంటర్వ్యూ సమయంలో తనను నడిపించిన తీరే ఆ సంస్థ తన సిబ్బందిని ఎలా చూసుకుంటుందో చెప్పడానికి ఒక సంకేతమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి అనుభవం ఎదురైంది ఒక్క టియారాకు మాత్రమే కాదు.
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేసిన ప్రశ్న ఏంటనే దానిపై బీబీసీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పాల్గొన్నన కొంతమంది తమకు ఇంటర్వ్యూలో ఎదురైన అత్యంత ఘోరమైన అనుభవాలను పంచుకున్నారు.
ఆ సమయంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టంగా అనిపించినప్పటికీ ఉద్యోగ ప్రపంచం గురించి అవి మనకు ఎంతో నేర్పుతాయి.

'నువ్వు ఏడుస్తావా?'
న్యూయార్క్‌లో ఒక బుక్ పబ్లిషర్ వద్ద అసిస్టెంట్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన చాస్ ఎడ్వర్డ్స్‌కు అసలు ఊహించని ప్రశ్న ఎదురైంది.
"నా మొదటి ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు నువ్వు ఏడుస్తావా అని నన్ను అడిగారు" అని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇంటర్వ్యూయర్ సరదాగా అడుగుతున్నారేమో అనుకుని "ఏడవను" అని చాస్ చెప్పారు.
ఆ ప్రశ్నకు అలాంటి సమాధానం చెప్పడం వల్లనే తనకు ఉద్యోగం వచ్చిందని తర్వాత ఆయనకు తెలిసింది.
"అంతకు ముందు ఆమె వద్ద ఉన్న అసిస్టెంట్ తరచూ ఏడ్చేవారట. అందుకే ఏడవని వ్యక్తి కావాలని ఆమె అనుకున్నారు. ఆమె సీరియస్‌గానే అడిగారు. కానీ నేనే జోక్ అనుకున్నాను" అని చాస్ చెప్పారు.
అయితే అది ఒక చెడు సంకేతం. ఆ ఉద్యోగం చాలా దారుణంగా ఉండేదని బాస్ ఎప్పుడూ విసుక్కునేవారని చాస్ చెప్పారు.
అక్కడ 13 నెలల పాటు ఏడవకుండా ఎలాగోలా పనిచేసినప్పటికీ, లోలోపల మాత్రం ఎంతో కుంగిపోయానని ఆయన అన్నారు.
"ఆమె దగ్గర పనిచేసి నేను ప్రపంచ రికార్డు సృష్టించాను. అంతకుముందు ఎవరూ ఆమె వద్ద మూడు నెలల కంటే ఎక్కువ కాలం నిలబడలేదు" అని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇంత జరిగినా, ఆ దారుణమైన అనుభవం పట్ల ఒక రకంగా కృతజ్ఞతతో ఉన్నానని చాస్ చెప్పారు. "ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన ఉద్యోగాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నా, దీనికంటే దారుణంగా అయితే లేవు" అని అంటూనే ఇప్పుడు తాను "ఎక్కడైనా ఏడవగలను" అని నవ్వుతూ చెప్పారు.
కొరిన్ కార్డ్‌కు కూడా ఇంటర్వ్యూలో ఒక వింత అనుభవం ఎదురైంది.
అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగం కోసం వెళ్లిన ఆమెను మొదటి ప్రశ్నగా 'మీకు జనంతో కలిసి పనిచేయడం ఇష్టమేనా?' అని అడిగారు.
ఆమె 'అవును' అని సమాధానం చెప్పగానే అయితే ఈ ఉద్యోగం మీకు సరిపోదని చెబుతూ ఇంటర్వ్యూను అక్కడితో ముగించేశారు.
"ఆ ప్రశ్న కావాలనే అడిగారా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే 'నాకు జనంతో పనిచేయడం ఇష్టం లేదు' అని ఎవరు చెప్తారు?" అని ఆమె ప్రశ్నించారు.
ఇంటర్వ్యూలలో ఇలాంటి వింత ప్రశ్నలు ఎదురైనప్పుడు ఆ ప్రశ్న గురించి మరింత స్పష్టత ఇవ్వాలని అడగడం మంచిదని పర్సనల్ కెరీర్ మేనేజ్‌మెంట్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కొరిన్ మిల్స్ చెప్పారు.
ఒకవేళ ఆ ప్రశ్నలు మరీ ఇబ్బందికరంగా ఉంటే ఆ సంస్థలో పని వాతావరణం ఎలా ఉంటుందో చెప్పడానికి అదొక సంకేతమని అన్నారు.
ఇంటర్వ్యూలు కేవలం కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికే కాదు. అభ్యర్థులు కంపెనీని అంచనా వేయడానికి కూడా ఉపయోగపడతాయని ఆమె చెప్పారు.

చట్టవిరుద్ధమైన ప్రశ్నలు
కొన్ని ప్రశ్నలు కేవలం విసుగు తెప్పించేవి మాత్రమే కాదు. వాటిని అడగడం చట్టవిరుద్ధం కూడా.
ఒక వ్యక్తి వయస్సు, వైకల్యం, లింగ మార్పిడి, వివాహం, గర్భం, జాతి, మతం, లింగం లేదా లైంగిక ధోరణి ఆధారంగా వివక్ష చూపించడం చట్టప్రకారం నేరం.
ఇంటర్వ్యూలలో మహిళలను 'మీకు పిల్లలు కనే ఆలోచన ఉందా?' అని అడగడం వివక్ష కిందకు వస్తుందని ఉపాధి చట్టాల న్యాయవాది రాయ్ మగారా తెలిపారు.
వయసు పైబడిన ఒక అభ్యర్థికి, యువకులతో కూడిన టీమ్ 'వైబ్'కు అతను సరిపోడనే కారణంతో ఉద్యోగం నిరాకరించిన కేసును కూడా తాను చూశానని ఆయన చెప్పారు.
ఇంటర్వ్యూలో మీపట్ల వివక్ష పూరితంగా వ్యవహరించారని భావిస్తే మీ అప్లికేషన్‌పై అంతర్గతంగా ఎలాంటి చర్చలు జరిగాయో తెలుసుకోవడానికి కంపెనీకి 'సబ్జెక్ట్ యాక్సెస్ రిక్వెస్ట్' పంపవచ్చని రాయ్ సూచించారు.
ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఇంటర్వ్యూలను మరింత కష్టతరం చేస్తాయి.
ముఖ్యంగా యజమానుల చేతిలోనే ఎక్కువ అధికారం ఉన్నప్పుడు అభ్యర్థులపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఇంటర్వ్యూను అంత భారంగా తీసుకోకూడదని హైరింగ్ సాఫ్ట్‌వేర్ సంస్థ 'విల్లో' కో-ఫౌండర్ ఇయాన్ కామెరాన్ అన్నారు.
"ఇంటర్వ్యూ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సాధారణ సంభాషణ మాత్రమే" అని ఆయన చెప్పారు.
అయితే టియారా విషయంలో జరిగినట్లుగా ఆ ఇద్దరు వ్యక్తులూ సమయానికి హాజరైనప్పుడే ఆ సంభాషణ సాధ్యమవుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























