ఇజ్రాయెల్: నెతన్యాహు ప్రత్యర్థి ఐజెన్‌కోట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానం.. అరబ్ పార్టీ కింగ్ మేకర్‌లు అవుతాయా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, నాథన్ విలియమ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ప్రతిపక్ష నాయకుడు గడి ఐజెన్‌కోట్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ తెలిపారు.
గతవారం జరిగిన ఎన్నికల్లో గడి ఐజెన్‌కోట్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి గానీ, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పార్టీ నేతృత్వంలోని కూటమి గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ సాధించలేకపోయాయి.
దీంతో అధ్యక్షుడు వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.
గడి ఐజెన్‌కోట్‌కు ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 28 రోజుల సమయం ఉంటుంది, మరో 14 రోజుల పొడిగింపు కూడా ఉంటుంది.
"జాతీయ అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మనం దానికి అర్హులమని నిర్థరించుకోవడానికి చేయగలిగినదంతా చేస్తా" అని ఐజెన్‌కోట్ ఎక్స్‌లో రాశారు.

ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ తెచ్చుకోలేదు.
అందుకే అక్కడి ప్రభుత్వాలన్నీ సంకీర్ణాల ద్వారానే ఏర్పడ్డాయి.
120 స్థానాలున్న పార్లమెంటులో, నెతన్యాహుకు చెందిన మితవాద లికుడ్ పార్టీ, దాని మిత్రపక్షాలు 53 స్థానాలను గెలుచుకోగా, ఐజెన్‌కోట్‌కు చెందిన మధ్యేవాద యషార్ పార్టీ, ఇతర యూదు ప్రతిపక్షాల కూటమి 48 స్థానాలు గెలుచుకున్నాయి.
అరబ్ పార్టీల నిర్ణయమే కీలకం
అరబ్ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనడంతో, అరబ్బుల నేతృత్వంలోని రెండు కూటములైన యునైటెడ్ అరబ్ లిస్ట్, జాయింట్ లిస్ట్ కలిసి 19 స్థానాలను గెలుచుకొని, భవిష్యత్ కింగ్ మేకర్లుగా మారే అవకాశం ఏర్పడింది.
అయితే, ఒక పార్టీ మినహా మిగిలిన యూదు పార్టీలన్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అరబ్ పార్టీలతో సహకరించబోమని ఎన్నికలకు ముందే వాగ్దానం చేశాయి.
అన్ని పార్టీలతో సంప్రదింపుల అనంతరం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఐజెన్‌కోట్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు హెర్జాగ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ నిర్ణయం గురించి ఆయన ఐజెన్‌కోట్, నెతన్యాహు ఇద్దరికీ తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందాలతో చర్చల అనంతరం, ప్రధానమంత్రి పదవికి ఐజెన్‌కోట్‌కు 67 సిఫార్సులు అందగా, నెతన్యాహుకు 46 సిఫార్సులు అందాయని ప్రకటనలో వెల్లడించారు.
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ నాయకుడికి ఎక్కువ అవకాశం ఉందో నిర్ణయించే అధికారం ఇజ్రాయెల్ అధ్యక్షుడికి ఉంది.
అందువల్ల, అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ నాయకుడికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతి ఆహ్వానించాల్సిన అవసరం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
మూడు ఆప్షన్స్
ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ ఏర్పాటుకు మూడు ఆప్షన్స్ సూచించాయి:
- నెతన్యాహు, ఐజెన్‌కోట్ ఇద్దరూ కలిసి ఒక జాతీయ ఐక్య ప్రభుత్వం
- నెతన్యాహు, ఐజెన్‌కోట్ వర్గం నుంచి విడిపోయిన సభ్యులతో కూడిన ఒక కూటమి,
- అరబ్ పార్టీల మద్దతుతో ఐజెన్‌కోట్ నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం.
ఐజెన్‌కోట్ ఆయన సంకీర్ణంలోని ఒక సభ్యుడు మినహా మిగతా వారందరూ గతంలో అరబ్ పార్టీలతో కూడిన ప్రభుత్వంలో చేరడానికి నిరాకరించారు, కానీ ఒక ఒప్పందం కుదరవచ్చని ఊహాగానాలు వినిపించాయి.
ఆయన అతి సంప్రదాయవాద పార్టీలతో కూడా రాజీకి రావడానికి ప్రయత్నించవచ్చు, కానీ అది కూడా కష్టమే.
గతాన్ని పరిశీలిస్తే... 2020లో, వరుసగా మూడు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించడంలో విఫలమైన తర్వాత, బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రత్యర్థి బెన్నీ గాంజ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విడతల వారీగా నాయకత్వ పగ్గాలు చేపట్టేలా అధికారాన్ని పంచుకునే ఒప్పందంతో అంగీకారానికి వచ్చారు.
మరోసారి ఎన్నికలకు వెళ్లకుండా, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, "ప్రస్తుత పరిస్థితులలో ప్రతి వాగ్దానాన్ని, ప్రతి నిబద్ధతను నెరవేర్చడం సాధ్యం కాదని పార్టీలు, వారి ప్రతినిధులు అర్థం చేసుకుంటారని" తాను ఆశిస్తున్నట్లు రాజకీయ పార్టీలతో చర్చలపై హెర్జాగ్ అన్నారు.
2019, 2022 మధ్య కాలాన్ని ఇజ్రాయెల్ రాజకీయాల్లో అత్యంత అస్థిరమైన కాలాలలో ఒకటిగా పరిగణిస్తారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సహకారాన్ని, ఏకాభిప్రాయాన్ని సాధించడంలో నెతన్యాహు, ఆయన రాజకీయ ప్రత్యర్థులు విఫలమవడంతో ఆ సమయంలో ఐదుసార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























