#కల్ట్ మూవీ: ముసుగు మనిషి రక్తపాతం థ్రిల్ పంచిందా, విశ్వక్ సేన్ దర్శక ప్రతిభ ఎలా ఉంది?

ఫొటో సోర్స్, x.com/VishwakSenActor
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ముసుగు ధరించిన సైకో కిల్లర్, ఒకరి తర్వాత ఒకరిని దారుణంగా హత్య చేస్తూ ఉంటాడు.
ఈ తరహా సినిమాలను స్లాటర్ థ్రిల్లర్స్ అంటారు. ఈ జానర్ తెలుగు సినిమాలో అరుదు.
విశ్వక్ సేన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన #కల్ట్ సినిమాను భారత్‌లో తొలి స్లాటర్ థ్రిల్లర్ అనే ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
మరి సినిమా ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
ముసుగు మనిషి చేసిన రక్తపాతం థ్రిల్లర్ ఆడియన్స్‌ను మెప్పించిందా?


ఫొటో సోర్స్, x.com/VishwakSenActor
ఎవరీ ముసుగు మనిషి?
గోవా హోం మినిస్టర్ (మురళీ శర్మ) తనయుడు ఎల్విన్ (తారక్ పొన్నప్ప)
#కల్ట్ పేరుతో గ్రాండ్‌గా తన బర్త్‌డే పార్టీ ప్లాన్ చేస్తాడు.
ఈ పార్టీలో అనూహ్యంగా ఓ ప్రాణాంతకమైన ఆట తెరపైకి వస్తుంది.
ముసుగు ధరించిన ఓ వ్యక్తి అక్కడ ఉన్న వారితో ఆటలు ఆడిస్తాడు.
ఇందులో ఓడిపోయిన వారిని దారుణంగా చంపేస్తుంటారు.
అదే పార్టీలో డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్సేన్) కూడా ఉంటాడు.
మరి ఈ గేమ్స్ ఆడిస్తున్న వారిని సంకల్ప్ ఎలా కనిపెట్టాడు?
ముసుగు ధరించిన వ్యక్తి ఎవరు? ఎందుకు ఈ పార్టీని టార్గెట్ చేశాడు? అన్నది మిగతా కథ.

ఫొటో సోర్స్, x.com/VishwakSenActor
యాక్షన్ సరే.. ఎమోషన్ ఎక్కడ?
స్లాటర్ థ్రిల్లర్ సినిమాల్లో రక్తపాతం, వరుస హత్యలు, భయపెట్టే సన్నివేశాలు ఉండటం సహజం.
కానీ అవే సినిమా మొత్తాన్ని నడిపించలేవు.
ప్రేక్షకుడిని కథలోకి లాగాలంటే భయంతో పాటు ఉత్కంఠ, పాత్రలతో కనెక్ట్ అయ్యేలా చేసే ఎమోషన్ కూడా ఉండాలి.
#కల్ట్‌లో ప్రధానంగా మిస్ అయిన అంశం ఇదే.
తొలి సగంలో అసలు కథ ఏమిటనేది సరిగ్గా ఓపెన్ కాదు.
వరుస హత్యలు, యాక్షన్ సన్నివేశాలతో కథనాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు.
కానీ ఈ హత్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అసలు ఏం జరుగుతోంది? అనే ఆసక్తిని బలంగా కలిగించడంలో సినిమా తడబడింది.
విశ్వక్సేన్ ఎంట్రీ తర్వాత అయినా కథనం గాడిలో పడుతుందని ఆశిస్తే, అక్కడ కూడా పెద్దగా మార్పు కనిపించదు.
యాక్షన్ సన్నివేశాలు వస్తుంటాయి.. మనుషులు చనిపోతుంటారు.
కానీ ప్రేక్షకుడికి మాత్రం కథతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడదు.

ఫొటో సోర్స్, instagram.com/vishwaksens
విశ్వక్సేన్ నటన.. దర్శకత్వం
నటుడిగా విశ్వక్సేన్ తన పాత్ర చక్కగా చేశాడు.
యాక్షన్ సన్నివేశాల్లో తనదైన ఎనర్జీని చూపించాడు.
అయితే, దర్శకుడిగా మాత్రం ఆయన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.
కథను సరైన సమయంలో ఓపెన్ చేయకుండా, పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్షన్‌ను ఏర్పాటు చేయకుండా, యాక్షన్‌తోనే మ్యాజిక్ చేయాలనుకున్నారు.
కానీ ఆ ప్రయత్నం పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు.
సినిమాలో ఏం జరుగుతోందనే ఆసక్తిని పెంచడం, పాత్రల గురించి ప్రేక్షకుడు ఆలోచించేలా చేయడం, తర్వాతి సన్నివేశం కోసం ఎదురుచూసేలా కథనాన్ని నడిపించడం థ్రిల్లర్‌కు చాలా ముఖ్యం.
#కల్ట్‌లో ఈ అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సింది. ముఖ్యంగా, విలన్ నేపథ్యాన్ని, హత్యల వెనుక ఉన్న కారణాలను బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే సినిమా ప్రభావం మరోలా ఉండేది.
సైకో లక్షణాలు గల పాత్రలో తారక్ పొన్నప్ప మెప్పిస్తాడు.
గాయత్రి భరద్వాజ్ ఓకే అనిపిస్తుంది.
కార్తికేయ, అనిరుధ్ పాత్రలు పరిధిమేరకు ఉంటాయి.
మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ అంత ప్రభావాన్ని చూపలేకపోయారు.

ఫొటో సోర్స్, instagram.com/vishwaksens
సాంకేతికంగా ఓకే.. కానీ!
రవిబస్రూర్ సంగీతంలో సౌండ్ ఉంది.
యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్టుగా నేపథ్య సంగీతం వినిపిస్తుంది.
అయితే, సినిమా అంతటా సంగీతంలో తగినంత వేరియేషన్ కనిపించదు.
సాంకేతికంగా సినిమా బాగానే ఉన్నప్పటికీ, ఆ పనితనం కథలోని లోపాలను కప్పిపుచ్చలేకపోయింది.
విజువల్స్, యాక్షన్, సౌండ్ డిజైన్ వంటి అంశాలు ఒక థ్రిల్లర్‌కు మంచి వాతావరణాన్ని సృష్టించగలవు.
కానీ ఆ వాతావరణంలో ప్రేక్షకుడిని ప్రయాణించేలా చేసేది మాత్రం బలమైన కథ, ఆసక్తికరమైన పాత్రలు, ఎమోషన్.
ఈ విషయంలో #కల్ట్ వెనుకబడింది.

ఫొటో సోర్స్, instagram.com/vishwaksens
చివరిగా..
#కల్ట్‌లో హింసకు కొదవ లేదు.
వరుస హత్యలు, రక్తపాతం, యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి.
కానీ వాటిని ఆసక్తికరమైన కథగా మలచడంలోనే సినిమా తడబడింది.
అనవసరంగా సాగదీసిన కథనం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది.
ఇది చిన్నపిల్లలు, సున్నిత మనస్కులు చూడదగ్గ సినిమా కాదు.
(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























