మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. 2 వారాల తరువాత తెరుచుకున్న రియాద్ ఎయిర్‌పోర్ట్, హూతీల హెచ్చరికలు ఏమిటి?

    సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమైన ఆదివారం నాడే మరోసారి రియాద్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

    హూతీ తిరుగుబాటు దారులు పదేపదే దాడులకు పాల్పడినట్టు కథనాలు వచ్చిన తరువాత రియాద్‌లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండు వారాలపాటు మూసివేశారు.

    ఆదివారం తెల్లవారుజామున ఒక విమానం ఇక్కడి నుండి టేకాఫ్ అయినట్లు ప్రపంచవ్యాప్తంగా విమానాల కదలికలను ట్రాక్ చేసే 'ఫ్లైట్‌రాడార్' వెబ్‌సైట్ పేర్కొంది.

    అయితే, రాజధాని రియాద్‌లో తాజాగా జరిగిన ఈ పేలుడుకు గల కారణాలపై సౌదీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

    మరోవైపు, కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం తమకు ఇప్పటికీ "సురక్షితం కానిది" "సైనిక లక్ష్యం" అని హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ, "విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వల్ల జరిగే పరిణామాలకు సౌదీ అరేబియానే బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని పేర్కొన్నారు.

    కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినప్పటి నుండి హూతీ తిరుగుబాటుదారులు ఈ విమానాశ్రయాన్ని పలుమార్లు లక్ష్యంగా చేసుకున్నారు.

    ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక దాడిలో 13 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

  2. న్యూజీలాండ్‌తో మ్యాచ్ మధ్యలో తిలక్, నితీశ్ తెలుగులో ఏం మాట్లాడుకున్నారు?

  3. ‘తుపాను వస్తోంది ఈ జాగ్రత్తలు తీసుకోండి’ - ఏపీఎస్‌డీఎంఏ, గరికిపాటి ఉమాకాంత్‌

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని, బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి సమీపంలో చేరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

    దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

    వర్షాల అంచనా:

    • ఆదివారం - 25-10-2026): కృష్ణా, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
    • మంగళ, బుధవారాలు: చెదురుమదురుగా అత్యంత భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

    అత్యవసర సహాయ నంబర్లు: ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఏవైనా అత్యవసర సహాయాలు లేదా సమాచారం కోసం 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

    ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

    • విపత్తుల సంస్థ, ఆర్టీజిఎస్, ఐఎండి పంపే వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
    • విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవాలి.
    • కనీసం ఒక వారానికి సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు సిద్ధం చేసుకోవాలి.
    • ఇంటి పైకప్పు, తలుపులు, కిటికీలు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి.
    • తుపాను సమయంలో ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, గ్యాస్ కనెక్షన్లను తొలగించాలి.
    • ఇల్లు సురక్షితంగా లేదని భావిస్తే ముందే పునరావాస కేంద్రాలకు వెళ్లాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
    • లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన, సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లాలి.
    • మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. పడవలు, తెప్పలను సురక్షిత ప్రాంతాల్లో బలమైన తాడులతో గట్టిగా కట్టాలి.
  4. బీజేపీకి రాహుల్ థాంక్స్, ‘ఈ 7రోజులు అదే ఉత్సాహంతో ఉండండి’

    కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవంబర్ 1న ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

    సర్‌లో అవకతవకలకు సంబంధించి నవంబర్ 1న దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ఇండీ కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది.

    ఈ విషయమై రాహుల్ గాంధీ ఆదివారం 'ఎక్స్'లో ఓ పోస్టు చేశారు. "మా ఓట్లను దొంగిలిస్తున్నారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారు. నియమ నిబంధనలను ఉల్లంఘించారు. ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీఛార్జ్ చేశారు." అని రాశారు.

    విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారవేత్తలు—ప్రజాస్వామ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ నవంబర్ 1న జరిగే ర్యాలీకి తప్పక రావాలి. ఓటు మీదే. పోరాటం మీదే అని పిలుపునిచ్చారు.

    "ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా ప్రచారం చేసి, వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చేసినందుకు బీజేపీకి, దాని మిత్రపక్షాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే ఏడు రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించండి!" అని రాహుల్ రాశారు.

    మరోవైపు, నవంబర్ 10 తర్వాత ఈ ర్యాలీని నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసింది.

    రద్దీగా ఉండే దీపావళి షాపింగ్ సీజన్‌లో ఈ ర్యాలీ వల్ల దిల్లీ వ్యాపారాలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లవచ్చని వాణిజ్య సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

  5. విశాఖను ఓ వాలంటరీ అసోసియేషన్ పాలించిందని తెలుసా? ఈ ఊరు మున్సిపాల్టీగా ఎప్పుడు మారింది, అప్పట్లో ఎన్ని వార్డులు ఉండేవి?

  6. మణిపుర్: ‘కట్టెల కోసం అడవికి వెళితే, మా అబ్బాయిని చంపేశారు.. నాలుగేళ్ల నా మనవరాలు నాన్న ఎక్కడ అంటోంది’

  7. ఫ్రాన్స్‌: నిరసనలు, ఘర్షణలు,దాదాపు 1,300 మంది అరెస్ట్

    ఫ్రాన్స్‌లో శనివారం నాటి నిరసనలు, ఘర్షణలకు సంబంధించి దాదాపు 13వందలమందిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ నిరసనల్లో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.

    శనివారం పగటిపూట నిరసనలు చాలావరకు శాంతియుతంగా సాగాయి. రాత్రి పొద్దుపోయాక కొన్నిచోట్ల నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. పారిస్ సహా పలు నగరాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. వాటర్ కానన్లను ఉపయోగించారు.

    మార్సెయ్ నగరంలో నిరసనకారులు రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లకు నిప్పుపెట్టారు. బోర్డో నగరంలో ఓ దుకాణానికి అమర్చిన చెక్క పలకలను కొందరు తొలగించారు.

    అయితే, గత వారాంతంలో జరిగిన స్థాయిలో అల్లర్లు, దోపిడీలు జరగకుండా అధికారులు ఇప్పటివరకు నియంత్రించగలిగారు.

    శనివారం జరిగిన నిరసనల్లో సుమారు నాలుగు లక్షల పదివేల మంది పాల్గొన్నట్టు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

    అయితే ఈ సంఖ్య దాదాపు 8 లక్షలుగా ఉంటుందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

    జీవన వ్యయం పెరగడం, పాఠశాలల్లో అధ్వాన పరిస్థితులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 70 వేల మంది పోలీసులను మోహరించారు. పలు నగరాల్లో ఆంక్షలు విధించారు.

    గతంలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసుల సంఖ్య కంటే ఆందోళనకారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరిస్థితులు అదుపుతప్పాయి. వందలాది వ్యాపార సంస్థల్లో దోపిడీలు జరిగాయి. భవనాలకు నిప్పుపెట్టారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

    గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు నిర్వహించే ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ వారం ప్రారంభంలోనే ఆదేశాలు జారీ చేశారు.

  8. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  9. ఫ్రాన్స్‌లోని ప్రధాన నగరాల్లో ఆందోళనలు

    ఫ్రాన్స్‌లోని ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.

    నిరసనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు పలు నగరాల్లో బాష్పవాయువు ప్రయోగించారు.

    లియాన్‌లో ఆందోళనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ గ్రెనేడ్లను ఉపయోగించారు.

    మార్సెయిల్‌లో కూడా టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యాలు నిరసనల ఫుటేజ్‌లో కనిపించాయి.

    “మేము 150 మంది ఉన్నాం. ఎక్కువ మంది సెకండరీ స్కూల్, యూనివర్సిటీ విద్యార్థులే” అని లియోన్‌లోని ఒక నిరసనకారుడు చెప్పారు.

    పోలీసులు వాటర్ కెనాన్లను ఉపయోగిస్తున్నారని, నైస్‌లో టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు కూడా నివేదికలు ఉన్నాయని ఫ్రెంచ్ వార్తాపత్రిక 'లే పారిసియన్' పేర్కొంది.

    పలు నగరాల్లో పోలీసులు-నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి.

    దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసనల్లో పాల్గొనడంతో 135 మందిని అరెస్ట్ చేసినట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి అంతకుముందు తెలిపారు.

    గత వారం అల్లర్ల వల్ల పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. 2,700 మందికి పైగా అరెస్టు అయ్యారు. పారిస్, మార్సెయిల్, లియోన్‌తో సహా పలు నగరాల్లో కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి.

    ఫ్రెంచ్ రాజధానిలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ, నగరంలో "అంతా ప్రశాంతంగా ఉంది" అని పారిస్ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

  10. గుజరాత్‌: 'సింహం ప్రతిరోజూ మా గ్రామంలోకి వస్తోంది, మేం ఎలా బతకాలి'

  11. దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి?

  12. న్యూజీలాండ్‌తో రెండో టీ ట్వంటీలో భారత్ విజయం

    న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.

    ఉత్కంఠగా సాగిన పోరులో కివీస్ జట్టు నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది.

    మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

    గ్లెన్ ఫిలిప్స్ 43 బంతుల్లో 77 పరుగులు చేయగా, బెవాన్ జాకబ్స్ 46 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

    భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయపథంలో నడిపాడు.

    ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు.

    కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 4 వికెట్లు తీశాడు.

    ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.

  13. “పీస్‌ బాండ్ పేపర్ల మీద సంతకం చేయనన్నాను”- నేహా బోరా

    శాంతి ఒప్పందంపై తాను సంతకం చేయబోనని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా చెప్పారు.

    పీస్ బాండ్ నోటీస్‌ను సవాలు చేస్తూ నేహా బోరా దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

    “పీస్ బాండ్‌మీద సంతకం చేయను. రాజ్యాంగం మనకు నిరసన తెలిపే హక్కుతో సహా అనేక హక్కులను కల్పించింది. దీంతో పాటు పీస్ బాండ్ కూడా ఉంది. అయితే ఈ బాండ్‌ను వాడుతున్న తీరు చూస్తుంటే దానిపై సంతకం చేయడం మన ప్రాథమిక హక్కులకు విరుద్ధం అవుతుంది” అని ఆమె అన్నారు.

    పీస్ బాండ్ మీద సంతకం చేయడం దేశంలో ప్రజాస్వామిక, శాంతియుత నిరసనను అణచివేయడానికి ఇదొక సంకేతంగా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

    “ఇలాంటి చర్యలను ఐసా అనుమతించదు. ఇవి మొదట సాధారణంగా కనిపించవచ్చు. కానీ వాటిని అడ్డం పెట్టుకుని నిరసనలను కట్టడి చేస్తారు” అని నేహా బోరా అన్నారు.

    అక్టోబర్ 16న 'లెహరా దో తిరంగా' నిరసనలో పాల్గొన్న తర్వాత, విచారణ సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి రూ. 10,000 వ్యక్తిగత పూచీకత్తు, ఒక ష్యూరిటీని సమర్పించాలన్న నోటీసును నేహా బోరా సవాలు చేశారు.

  14. కళ్లద్దాలతో స్పష్టంగా కనిపిస్తే కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లేనా? చూపు తగ్గుతోందని ఎలా గుర్తించాలి?

  15. పాకిస్తాన్‌లో రూ. 7 వేలు దాటిన సిలిండర్ ధర

    పాకిస్తాన్‌లో వంట గ్యాస్ ధరలు పెరిగాయి.

    పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఎల్పీజీ ధర కిలోకు 600 రూపాయలు దాటిందని బీబీసీ ఉర్ధూ కథనం తెలిపింది. గత వారం సుమారు 4,500 రూపాయలుగా ఉన్న 11.67 కేజీల సిలిండర్ ధర 7,000 రూపాయలకు పెరిగింది.

    పాకిస్తాన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా తన ద్రవ్యోల్బణ గణాంకాలలో ఎల్‌పీజీ ధరలలో పెరుగుదలను ధృవీకరించింది.

    గత వారంతో పోలిస్తే ఈ వారం చివరి నాటికి ఎల్‌పీజీ ధరలు 22.50 శాతం పెరిగాయని ఫెడరల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

    గతేడాది అక్టోబరులో ఇదే వారంతో పోలిస్తే ధరలు 107 శాతం పెరిగాయి.

    గమనిక: ఈ వార్తలో రూపాయి అంటే పాకిస్తానీ రూపాయి అని గుర్తించగలరు.

  16. అజర్‌బైజాన్‌: దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?

  17. అల్లూరి జిల్లాలో పేలుడు, ఐదుగురి మృతి, లక్కోజు శ్రీనివాస్

    ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన పేలుడు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

    అనంతగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పాడేరు ఎస్పీ కార్యాలయం తెలిపింది. ఇది ప్రమాదమేనని ప్రాధమికంగా నిర్థరించినట్లు పోలీసులు బీబీసీకి తెలిపారు.

    “రోడ్డు నిర్మాణ పనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న వాహనంలో అనంతగిరి మండలంలోని పినకోట సమీపంలో డీజిల్ నింపడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్థరణ జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మృతుల్లో ఒక ప్రభుత్వ టీచర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది” అని ఈ కేసును పర్యవేక్షిస్తున్న అనంతగిరి ఎస్ఐ శంకర్రావు బీబీసీకి తెలిపారు.

    ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అల్లూరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

    ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

    మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

  18. ‘‘గుండెల్లో నొప్పి, చనిపోతాననే ఆందోళన’’.. కానీ డాక్టర్లు ఏ అనారోగ్యమూ లేదనేవారు

  19. ‘మక్కా ఒప్పందం ఉన్నా తుర్కియేకు హూతీ రెబెల్స్‌తో పోరాడే ఉద్దేశం లేదు’

    ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ఎలాంటి సైనిక పోరాటంలోనూ పాల్గొనే ఉద్దేశం తమకు లేదని తుర్కియే తెలిపింది.

    వాస్తవానికి సౌదీ అరేబియా, పాకిస్తాన్‌తో కలిసి తుర్కియే ఉమ్మడి రక్షణ ఒప్పందం (మక్కా ఒప్పందం) కుదుర్చుకుంది.అయితే, సౌదీ అరేబియాపై దాడులు చేస్తున్న హూతీ తిరుగుబాటుదారులతో పోరాడేందుకు తుర్కియే నిరాకరించింది.

    ‘‘హూతీలతో ఎలాంటి పోరాటంలోనూ పాల్గొనే విషయాన్ని మేం పరిశీలించడం లేదు’’ అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తుర్కియే రక్షణ మంత్రి యాషర్ గులెర్ చెప్పారు.

    సౌదీ అరేబియాకు తుర్కియే అందించే సైనిక సహాయం ప్రధానంగా దాడులను నిరోధించే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికే ఉద్దేశించినదని ఆయన తెలిపారు.

    ఆగస్టులో తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య ‘మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం’ కుదిరింది. ఈ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, దాన్ని మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.