మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. మోదీని ఉద్దేశించి ఖర్గే చేసిన వ్యాఖ్యలేంటి, క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది?

  2. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నబ్’ తుపానుగా మారినట్టు ఐఎండీ ప్రకటన

    తూర్పు-మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘అర్నబ్’ తుపానుగా మారిందని ఐఎండీ ప్రకటించింది.

    ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

    ఈరోజు (అక్టోబర్ 26) ఉదయం 5:30 గంటలకు తుపాను 15.4° ఉత్తర అక్షాంశం, 88.9° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉందని ప్రకటించింది. శ్రీ విజయపురం (అండమాన్ దీవులు)కు వాయువ్య దిశలో 590 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 610 కి.మీ దూరంలో, విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 650 కి.మీ దూరంలో, కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 730 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి తూర్పు దిశలో 830 కి.మీ దూరంలో, బాపట్లకు తూర్పు దిశలో 910 కి.మీ దూరంలో ఉంది.

    మరింత బలపడనున్న తుపాను

    అర్నబ్ తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ అర్ధరాత్రి నాటికి తీవ్ర తుపానుగా, అక్టోబర్ 27 నాటికి అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల- విశాఖ మధ్య తీరాన్ని దాటే అవకాశముంది.

    తీరాన్ని దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ఈదురుగాలుల వేగం 140 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

  3. జేబులో రూ. 300తో బస్సెక్కి బెంగళూరు వచ్చిన కుర్రాడు ఇండియాలో అగ్రశ్రేణి నటుల్లో ఒకరిగా ఎలా ఎదిగారు?

  4. బ్రెజిల్‌ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన లులా డా సిల్వా, మూడు వారాల్లోనే మారిన ఫలితం

    బ్రెజిల్‌కు చెందిన సీనియర్ వామపక్ష నేత, ప్రస్తుత అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తీవ్ర పోటీ, పరస్పర విమర్శల మధ్య సాగిన ఎన్నికల్లో ఆయన తన రైట్‌వింగ్ ప్రత్యర్థి ఫ్లావియో బోల్సోనారోను ఓడించి పీఠాన్ని కైవశం చేసుకున్నారు.

    లులా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం ఇది నాల్గోసారి. ఆయన 2003 జనవరి నుంచి 2010 డిసెంబర్ వరకు వరుసగా రెండు సార్లు బ్రెజిల్ అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం 2003జనవరిలో మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఇప్పుడు నాల్గోసారి గెలుపొందారు.

    అయితే, ఆదివారం జరిగిన తుది దశ ఓటింగ్‌లో లులా గెలుపొందడం అంత సులభంగా జరగలేదు. చాలా ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొని ఈ విజయం సాధించారు.

    అక్టోబర్ 4న జరిగిన తొలి దశలో లులాపై బోల్సోనారో ఆధిక్యం సాధించారు. అయితే కేవలం మూడు వారాల్లోనే ఆ ఫలితాన్ని తలకిందులు చేసి లులా విజయం సాధిస్తారని అంచనాలు లేవు.

    లాటిన్ అమెరికాలో ఇటీవల కనిపిస్తున్న రాజకీయ ధోరణికి భిన్నంగా కూడా లులా విజయం సాధించారు. అక్కడి ఓటర్లు అధికారంలో ఉన్న నేతలను తిరస్కరిస్తూ, మితవాద పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. అర్జెంటీనా, చిలీ, కొలంబియా వంటి దేశాల్లో ప్రస్తుతం కన్జర్వేటివ్ నేతలే అధికారంలో ఉన్నారు.

    లులా ఒక మాజీ మెటల్ వర్కర్. ఆయన 1989లో తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి నుంచి వామపక్ష రాజకీయాల్లో ప్రధాన నాయకుడిగా ఉంటూ వచ్చారు. 2003లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యేనాటికి ఆ దేశం చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది.

    ఇప్పుడు ఆయన పదవీ కాలం 2027 జనవరి 5 న ప్రారంభంకానుంది. ఇప్పుడు కూడా ఆయనకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో ఉన్న విభేదాలు ఆయనకు ఎదురయ్యే ప్రధాన ఛాలెంజ్.

  5. బుకాంగి: కాలువలోకి వచ్చిన ఆడ సొర చేపను ఎన్నిసార్లు వెనక్కు పంపినా ఎందుకు మళ్లీమళ్లీ అక్కడికే వచ్చింది? ఇప్పుడది ఎక్కడుంది

  6. రెండు రోజులు ప్రయాణాలు వద్దు- తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అధికారుల విజ్ఞప్తి

    తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.

    మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో కట్టి ఉంచుకోవాలన్నారు.

    విశాఖకు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్ర వాయుగుండం రేపు, ఎల్లుండి తీవ్ర తుపానుగా మారుతుందని, సుమారు 125 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని జైన్ హెచ్చరించారు. అందుకే ప్రయాణాలు పెట్టుకొవద్దని సూచించారు.

    సోమవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, పోలవరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

  7. ‘అతి తీవ్ర తుపానుగా మారొచ్చు’.. విశాఖపట్నానికి 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండంపై అధికారుల హెచ్చరిక

    తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం ఇవాళ తుపానుగా, రేపు తీవ్ర తుపానుగా మారబోతోంది.

    ఇది యానాం- బాపట్ల, విశాఖ పట్నానికి మధ్య అక్టోబర్ 28వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

    ప్రస్తుతానికి ఈ తీవ్ర వాయగుండం 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.

    ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం(అక్టోబర్ 25) రాత్రి ప్రకటించిన సమాచారం ప్రకారం.. ప్రకారం తీవ్ర వాయుగుండం విశాఖకు 820 కి.మీ., కాకినాడకు 910 కి.మీ., మచిలీపట్నానికి 1010 కి.మీ.,బాపట్లకు 1080 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

    ఈ తీవ్రవాయుగుండం సోమవారం(అక్టోబర్ 26) ఉదయానికి తుపానుగా, మంగళవారం(అక్టోబర్ 27) ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా,బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

    ఇది తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిరంతరం తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని.. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

  8. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  9. ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. గుడ్‌నైట్

    ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.

  10. చిన్నస్వామి స్టేడియం అంటే అందుకే ఇష్టం: ధోని

  11. నవంబర్ 1న జరిగే ర్యాలీకి పదిలక్షలమంది హాజరవుతారు: కాంగ్రెస్

    భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం మరోసారి డిమాండ్ చేశారు.

    దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో నవంబర్ 1న ఇండియా కూటమి ర్యాలీ జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు.

    ఈ భారీ ర్యాలీలో 10 లక్షల మంది పాల్గొంటారని ఆయన చెప్పారు.

    "ఎస్ఆర్ఐను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతంగా నిర్వీర్యం చేశారు. ఈ విధానంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఈ ర్యాలీ ఏ ఒక్క వ్యక్తి కోసమో లేదా ఏ ప్రత్యేక రాజకీయ పార్టీ కోసమో కాదు. సామాన్య పౌరుల ఓట్లను కాపాడటానికే ఈ ర్యాలీ. పది లక్షల మంది దిల్లీకి తరలివస్తారు’’ అని ఆయన అన్నారు .

    "ఇది సీనియర్ నాయకులందరి బాధ్యత. మనమందరం కలిసికట్టుగా పనిచేసి ఐక్యంగా ముందుకు సాగుదాం" అని చెప్పారు.

    కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉత్తరప్రదేశ్, హరియాణా పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

  12. అండర్ వరల్డ్ అంటే బాలీవుడ్ వణికిన ఆ రోజులు ఎలా ఉండేవంటే..

  13. ఫైనాన్స్ విత్ హరీశ్: ఆన్‌లైన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య... 'అర్హత' ఏంటని ప్రశ్నించినందుకేనా?

  14. 'మన పొరుగువాళ్లే మనల్ని రక్షిస్తున్నారు' అంటూ కశ్మీర్ గురించి ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై వివాదమేంటి? పార్టీలు ఏమన్నాయి?

  15. రష్మికతో వందసార్లు అడిగించుకుని పెళ్లికి ఓకే చెప్పానన్న విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ ఏంటి?

  16. బ్లూటూత్: ఈ పేరు వెనకున్న1,000 ఏళ్ల చరిత్ర ఏంటి?

  17. కన్నడిగులకు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగాలు నిరాకరిస్తే కఠిన చర్యలు: డీకే

    బెంగళూరు ఐటీ కంపెనీల్లో కన్నడిగులకు ఉద్యోగాలను నిరాకరిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడం బాధాకరమని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అన్నారు.

    స్థానికంగా కన్నడం మాట్లాడేవారిని ఉద్యోగ అవకాశాల్లో పక్కనపెడుతున్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

    ఏదైనా ప్రైవేటు సంస్థ ఉద్దేశపూర్వకంగా కన్నడిగులను పక్కనపెట్టినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.

    కన్నడిగుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, వారి సమస్యలపై స్పందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు.

  18. ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకూడదు: ఐరాసకు జైశంకర్ సూచన

    ప్రపంచ సంక్షోభాలను ఐక్యరాజ్యసమితి చూస్తూ ఉండిపోకుండా నాయకత్వ పాత్ర పోషించాలని విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ చెప్పినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్‌ సమ్మేళన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

    ‘‘మనం పరిపూర్ణత లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. అయితే, మరింత మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనేఉన్నాం. ఐక్యరాజ్యసమితి దానిలోని లోపాలను, పరిమితులను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకుకృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వామ్యం లేకుండా చేయకూడదు. ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకుండా ఐక్యరాజ్యసమితి నాయకత్వ పాత్ర పోషించాలి” అని జైశంకర్ అన్నారు.

  19. పాకిస్తాన్: సౌదీ నుంచి వచ్చానంటూ తమ్ముడి అంత్యక్రియల్లో పాల్గొన్న అన్నయ్యే హంతకుడని ఎలా తెలిసింది?

  20. ‘మణిపుర్‌లో శాశ్వత శాంతి స్థాపన కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం’

    మణిపుర్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్త కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ తెలిపారు.

    రాష్ట్రంలోని అధికారికంగా గుర్తించిన 33 షెడ్యూల్డ్ తెగలతో సహా మొత్తం 36 వర్గాల నుండి ఈ కమిటీలో ప్రతినిధులు ఉంటారని ఆయన అన్నారు.

    శనివారం ఇంఫాల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఖేమ్‌చంద్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో ఈ శాంతి కమిటీ ప్రాధాన్యం గురించి చర్చించినట్లు తెలిపారు.

    ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించేందుకు ఖేమ్‌చంద్ సింగ్ ఈ నెల అక్టోబర్ 10న న్యూదిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

    యాదృచ్ఛికంగా, అదే రోజు మణిపుర్‌లో భారీ హింస చెలరేగింది. 12 గంటల వ్యవధిలో కామ్‌జోంగ్, కాంగ్‌పోక్పిఉఖ్రుల్ జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో తొమ్మిది మంది మరణించారు.

    మే 3, 2023 నుంచి మెయితీ సమాజానికి, కుకీ తెగకు మధ్య కొనసాగుతున్న హింస ఈ ఏడాది కొంతమేరకు సద్దుమణిగింది. అయితే, ఫిబ్రవరిలో ఉఖ్రుల్ జిల్లాలో కుకీ, నాగా యువకుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత పరిస్థితి మళ్లీ తీవ్రరూపం దాల్చింది.

    దాదాపు ఎనిమిది నెలల క్రితం ప్రారంభమైన నాగ-కుకీ ఘర్షణలో ఇప్పటివరకు కనీసం 22 మంది నాగాలు, 31 మంది కుకీలు మరణించారు. మైతేయి, కుకీ, నాగ వర్గాల మధ్య నెలకొన్న ఈ త్రిముఖ ఉద్రిక్తత రాష్ట్ర ప్రభుత్వానికి సవాళ్లను మరింత తీవ్రతరం చేసింది.