పంజాబ్: ఉపాధి హామీ పథకం కూలీలపైకి దూసుకెళ్లిన కారు-8 మంది మృతి

ఫొటో సోర్స్, Kulvir Singh/BBC
పంజాబ్‌లోని సంగ్రూర్‌లో రోడ్డుపై పని చేస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలపైకి ఒక కారు దూసుకెళ్లింది. అక్కడ పని చేస్తున్న వారిలో 8 మంది మృతి చెందారు. మరికొందరు కూలీలు గాయపడ్డారు.
సంగ్రూర్ జిల్లాలోని లెహ్రాగాగా-జఖల్ రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆ రోడ్డుపై పని చేస్తున్న కూలీలను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టిందని సంగ్రూర్ ఎస్పీ పల్విందర్ సింగ్ చీమా చెప్పారు. మృతి చెందిన 8 మందిలో ఆరుగురు మహిళలు ఉన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దాదాపు 25 మంది వరకు కూలీలు పని చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒక మోటార్ సైకిల్ కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఆయన కోసం గాలిస్తున్నారు.












