ఇజ్రాయెల్ నుంచి ఆస్ట్రియా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు
ఇజ్రాయెల్ నుంచి ఆస్ట్రియాకు వెళ్తున్న ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని బల్గేరియా రాజధాని సోఫియాకు మళ్లించారు.
‘‘ఆదివారం రాత్రి (అక్టోబర్ 18) టెల్ అవీవ్ నుంచి వియన్నాకు ప్రయాణిస్తున్న ఎయిర్‌బస్ ఏ320 విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందన్న సమాచారం అందడంతో విమానాన్ని సోఫియాకు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు’’ అని బల్గేరియా రవాణామంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్టు బల్గేరియా, ఇజ్రాయెల్ మీడియా సంస్థలు వెల్లడించాయి.
విమానంలో 51 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి బీబీసీకి తెలిపారు. బాంబు బెదిరింపు సమాచారం అందిన దాదాపు 30నిమిషాల తర్వాత విమానం సోఫియాలో ల్యాండ్ అయింది.
‘‘సోఫియాలో విమానం దిగిన తర్వాత అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో అనంతరం ఆ విమానంలోనే ప్రయాణీకులందరినీ ఎక్కించారు. విమానం తర్వాత సురక్షితంగా వియన్నాలో ల్యాండ్ అయింది’’ అని ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.